Sunday, June 10, 2007

అది పాతది

'ఈడ్రాయర్‌ ఎంత?' అడిగాడు చంద్రకాంత్‌.

ధర చెప్పాడు సేల్స్‌బాయ్‌.

'వేసుకుని చూడొచ్చా?'

'డ్రాయర్‌ను కూడా ఏం వేసుకుంటారండీ బాబూ, సరే చూడండి' గొణుగుతూనే ఒప్పుకున్నాడు బాయ్‌.

వేసుకుని చూసి, వచ్చి, 'సరిగ్గా సరిపోయింది' చెప్పాడు చంద్రకాంత్‌.

దాన్ని ప్యాక్‌ చేయబోయాడు సేల్స్‌బాయ్‌.

'అదొద్దు, అది వాడింది కదా... వేరేదివ్వండి'.

అమ్మానాన్నా ఆట


బాబీ: ఈరోజు ఏం ఆట ఆడుకుందాం.

హనీ: అమ్మానాన్నా ఆట.

చిన్నూ: మరి నేనో?

హనీ: నువ్వు మా అబ్బాయివి.

బాబీ: ఆ ఆట నాకు రాదుగా.

బుజ్జి: నేను చెబుతాలే, నువ్వు పేపర్లూ పుస్తకాలూ నాపైకి విసురు. నేను గ్లాసులూ గిన్నెలూ నీమీదికి విసురుతాను. కాసేపయ్యాక నువ్వు తలుపు ధడేల్‌మని లాగి బజారుకు వెళ్ళిపో. నేనేవో ఈ చిన్నూగాడి వీపు పగలగొడతాను. ...అంతే.

అయితే పద


'నాన్నా... సర్కస్‌కు వెళ్దాం' అడిగాడు దీపు.
'ఏముంటుందిరా అందులో' పెదవివిరిచాడు తండ్రి.
'ఏనుగులున్నాయట నాన్నా'
'ఏనుగుల్నేం చూస్తాంరా'
'ఏనుగులు ఫుట్‌బాల్‌ ఆడతాయట'
'అందులో చూడ్డానికేముందిరా'
'షార్ట్స్‌ వేసుకున్న అమ్మాయిలు ఆ ఏనుగులను ఆడిస్తారట'
'సర్లే వెళ్దాం పద, ఏనుగులను చూడక చాలా ఏళ్లయింది'.

అందుకూ...


రాధ: నువ్వు కొత్తచీర కొనమంటే మీ ఆయన ఎగిరి గంతేస్తాడా, ఆశ్చర్యంగా ఉందే. ఎందుకలా?

రజని: కొత్తచీర కట్టుకోగానే ఆయన కాళ్ళకు నమస్కరిస్తాను. ఆ సీనంటే ఆయనకు మహా ఇష్టంలే.

అక్కర్లేని అబద్ధం


ఓబిల్డింగులో మూడు టైమ్‌బాంబులను చాకచక్యంగా పట్టుకున్నారు కానిస్టేబుళ్లు రాయప్ప, వెంగళప్ప.
జీపులో వాటిని స్టేషన్‌కు పట్టుకెళ్తున్నారు.
'అవునూ... మనం వెళ్తుండగానే ఓ బాంబు పేలిపోతే ఎట్లా?' భయంగా అడిగాడు రాయప్ప.

'దాందేముంది? రెండే దొరికాయని చెబుదాం' నవ్వుతూ బదులిచ్చాడు వెంగళప్ప.

'విల్‌' పవర్‌


ఏడుగురు కొడుకుల తండ్రి అరవై ఏళ్ల రాధాకృష్ణకు బ్రహ్మచెవుడు. ఈమధ్యే చికిత్స చేయించుకున్నాడు. కొన్ని వారాల తర్వాత ఆయనకు వైద్యం చేసిన డాక్టర్‌ తారసపడ్డాడు.
'మీకు ఇప్పుడు బాగా వినపడుతోందా?' పలకరించాడు వైద్యుడు.
'బ్రహ్మాండంగా' బదులిచ్చాడు రాధాకృష్ణ.
'మీ ఇంట్లోవాళ్లు చాలా సంతోషించాలే'
'వాళ్లకు ఈ చికిత్స సంగతి తెలియదు'
'ఏం? ఎందుకని చెప్పలేదు?'
'నా గురించి ఏమనుకుంటున్నారో వినాలని...'
'ఏమంటున్నారు మరి...'
'నువ్వే అర్థంచేసుకో. ఇప్పటికి ఐదుసార్లు నా వీలునామాను మార్చాను'.

రోజూనా?


నానిని కొత్తగా బడిలో వేస్తోంది శారద. వెళ్లనని మారాం చేస్తుంటే,
'అక్కడ నీకు కొత్త కొత్త విషయాలు చెబుతారు, చాలామంది స్నేహితులు అవుతారు...' అంటూ ఊరించి చెప్పి పంపేసింది.
రెండో రోజు ఉదయం కొడుకును తట్టి నిద్రలేపుతోంది శారద.
'ఊఁ...' అంటూ మూలిగి పక్కకు తిరిగి పడుకున్నాడు నాని.
'ఏంటీ బడికి వెళ్లవా?' అడిగింది తల్లి.
'ఈ రోజు కూడానా?' ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు నాని.

మేధావే


'మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో ఓ కాగితం మీద రాయండి' చెప్పింది టీచర్‌.
కలెక్టర్‌, ఇంజినీర్‌, డాక్టర్‌... ఎవరికి తోచింది వారు రాస్తున్నారు.
'ష్‌...' చిన్నగా సంధ్యను పిలిచాడు కిట్టు.
'ఏంటీ?' అడిగింది సంధ్య.
'మేధావిలో 'ధ'కు పొట్టలో చుక్క ఉంటుందా?'

అర్థం అదే


వివాహం అంటే ఏమిటో తన నాలుగేళ్ల కూతురు శ్వేతకు ఎంతకూ అర్థం కావట్లేదు.
దాంతో సాయినాథ్‌ తన పెళ్లి ఆల్బమ్‌ చూపిస్తూ ఒక్కొక్కటే విడమరిచి చెబుతున్నాడు.
అన్ని ఫొటోలు చూశాక అంది శ్వేత...
'ఓహో! అప్పట్నుంచి అమ్మ మనింట్లో పనిచేయడానికి వచ్చిందన్నమాట'

సుకవి-కుకవి


నేను మా

ఆవిడను ఎక్కడెక్కడికో
తీసుకెళ్తుంటాను తెలుసా?
నేనూ

తీసుకెళ్తాను కానీ
ప్రతిసారీ ఇంటికి
వచ్చేస్తూనే ఉంది.

ఇప్పటికైంది పొదుపు


'డార్లింగ్‌... 1979 నుంచి కారు కొనాలన్న మన కల నెరవేరబోతోంది' ఉత్సాహంగా చెప్పాడు భర్త.
'ఏంటీ నిజమా?' ఆశ్చర్యపోయింది భార్య.
'మన పెళ్లయినకొత్తలో 'క్యాడిలాక్‌' కొనాలనుకున్నాం కదా... ఇవ్వాల్టికి దానికి కావాల్సిన డబ్బు పొదుపుచేయగలిగాం'
'అయితే లేటెస్ట్‌ క్యాడిలాక్‌ మన ఇంటికి వస్తుందన్నమాట' అరిచినంత పనిచేసింది భార్య.
'లేటెస్టుది కాదు... 1979 నాటిది'.

కానీ భాషమాది


ఓఅమెరికన్‌ టూరిస్టు లండన్‌ హోటల్లో దిగాడు.
'ఎలివేటర్‌ పనిచెయ్యట్లేదా?' ఉద్యోగిని అడిగాడు అమెరికన్‌.
'అంటే లిఫ్టు అనా మీ ఉద్దేశం?'
'నేను ఎలివేటర్‌ అంటే ఎలివేటర్‌ అనే'
'కానీ ఇక్కడ దాన్ని లిఫ్టు అంటారు సర్‌'
'అలా ఎలా అంటారు? ఎలివేటర్‌ను కనిపెట్టింది మా అమెరికావాళ్లు'
'కానీ ఇంగ్లిష్‌ను కనిపెట్టింది మేము'.

అది మీ పని


భర్తకు ప్రత్యేకంగా ఆర్గానిక్‌ కూరగాయలు కొందామని సూపర్‌మార్కెట్‌కు వెళ్లింది సుప్రియ.
'ఇవి ఆర్గానిక్‌వేనా?' కూరగాయల వంక చూపిస్తూ సేల్స్‌బాయ్‌ను అడిగిందామె.
అర్థం కానట్టు ముఖంపెట్టాడు సేల్స్‌బాయ్‌.
'నా భర్తకోసం కావాలి, వీటికి క్రిమిసంహారకమందులేమీ వేయలేదు కదా?' వివరంగా అడిగింది మళ్లీ.
'మేము వేయలేదు మేడమ్‌, మీరే వేసుకోవాలి' బదులిచ్చాడు బాయ్‌.

చెప్పడం బదులు


'ఈ టెక్నిక్‌ను ఇంట్లో మాత్రం ప్రయోగించకండి' చెప్పాడు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణుడు.
'ఎందుకనీ' అడిగారు వింటున్నవారు.
'మా ఆవిడ వంట చేయడం ఓ రోజు గమనించాను. సరిగ్గా 64 నిమిషాలు తీసుకుంది. సింకు దగ్గరికీ ఫ్రిజ్‌ దగ్గరికీ స్టౌ దగ్గరికీ మార్చి మార్చి తిరుగుతూ వృథా చేసే సమయాన్ని తగ్గించుకోగలిగితే నలభై నిమిషాలకంటే మించదు అన్నా'
'తర్వాతేమైంది?'
'వంట నలభై నిమిషాల్లోనే అవుతోంది. కానీ నేను చేస్తున్నా' బాధగా చెప్పాడు నిపుణుడు.

మావారి ప్రతిభ

రాజీ: ప్లేట్లు ఇంత తళతళ్ళాడుతున్నాయి, పనిమనిషి మారిందా?
రమ: అదేం లేదు. నాల్రోజుల్నించీ పనమ్మాయి రావట్లేదు, మావారే తోముతున్నారు.

ప్రార్థన

టీచర్‌: ప్రతిరోజూ భోజనం చేసేముందు నేను దేవుణ్ని ప్రార్థిస్తాను. రామూ... మరి నువ్వు?
రాము: ప్రార్థన చెయ్యను సార్‌.
టీచర్‌: ఎందుకని.
రాము: మా అమ్మ వంట బాగానే చేస్తుంది.

ఫ్రీగా...కొన్నా

'ఈరోజు బజారుకెళ్ళి మీకోసం అరడజను రుమాళ్ళు కొనుక్కొచ్చా' ఆఫీసునుంచి వచ్చిన భర్తకు కాఫీకప్పు అందిస్తూ చెప్పింది రాగిణి.
'ఎందుకంత శ్రమ, నేను తెచ్చుకునేవాణ్ణిగా. మరీ ఖరీదైనవి తెచ్చావా ఏం' భార్య ప్రేమకు మురిసిపోతూ అడిగాడు హరి.
'ఎక్కువ రేటెందుకు పెడతానూ, అవి ఫ్రీగా వచ్చాయిలెండి. పదివేలుపెట్టి పట్టుచీర కొన్నాకదా' చల్లగా చెప్పింది రాగిణి.

బయటకు తీసేదెలా?

తొలిసారి విమానమెక్కిన వెంగళప్ప టేకాఫ్‌ అవగానే
'మేడమ్‌... శబ్దానికి చెవులు చిల్లులు పడేట్టున్నాయి. ఏదైనా చెయ్యండి' అన్నాడు ఎయిర్‌హోస్టెస్‌తో.
'ఫర్వాలేదు సార్‌. ముందీ చూయింగ్‌ గమ్‌ తీసుకొండి' చేతిలోని ప్లేటుని చూపిందామె.
విమానం ల్యాండయ్యాక 'ప్రయాణం ఎలా సాగింది సార్‌' వెంగళప్పని అడిగిందామె.
'మీ దయవల్ల సాఫీగానే సాగింది గానీ నా చెవిలో పెట్టుకున్న గమ్‌ని ఎలా తియ్యాలో చెప్పారు కాదు!'

ఆయనెక్కడ?


ప్రిన్సిపాల్‌గా ఆరోజే బాధ్యతలు తీసుకున్నాడు రామస్వామి. పక్కనున్న క్లాసురూములో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. ఆ శబ్దం విని అటువైపు వెళ్లాడాయన.
అందరిలో పొడవుగా ఉన్న ఓ కుర్రాణ్ని ఈడ్చుకొచ్చి వరండాలో నిలబెట్టాడు.
తరువాత ఆ గదిలోకి వెళ్లి క్రమశిక్షణ మీద ఓ క్లాసు తీసుకున్నాడు.
'పిల్లలూ... ఇంతకీ మీ టీచర్‌ ఏమయ్యాడు?' అడిగాడు.
'అదే సార్‌... ఇందాక మీరు వరండాలోకి ఈడ్చుకెళ్లారే ఆయనే' చెప్పారు పిల్లలు.

డైటింగ్‌

ఓ పిజ్జా కార్నర్‌కి వెళ్లాడు వెంకట్‌.
'ఓ పెద్ద పిజ్జా తెస్తావా' కూర్చుని ఆర్డరిచ్చాడు.
'ప్లేటు కాస్త చిన్నగా ఉంది సార్‌. పిజ్జాని నాలుగు ముక్కలు చేసి తీసుకొస్తాను' అన్నాడా సర్వర్‌.
'వొద్దొద్దు... అసలే డైటింగ్‌ చేస్తున్నాను. నాలుగు ముక్కలు తింటే ఏమన్నా ఉందా. రెండు చేసి తీసుకురా' చెప్పాడు వెంకట్‌.

ఇంతేసంగతులు!

జైలు ఆవరణలో కంగారుగా తిరుగుతున్నాడు కానిస్టేబుల్‌ అప్పారావు.
'ఏంటయ్యా... మరీ కంగారుగా తిరుగుతున్నావ్‌' అప్పుడే డ్యూటీకి వచ్చిన మరో కానిస్టేబుల్‌ ప్రసాద్‌ అడిగాడు.
'రాత్రి ఖైదీలతో పాండవ వనవాసం నాటకం వేయించాం. పాండవుల వేషం వేసిన ఖైదీలు వనవాసానికని చెప్పి అప్పుడనగా వెళ్ళారు.
ఇంకా రాలేదు...!'.

అవకాశం వదలను!

రైల్లో తన పక్కసీట్లో ప్రయాణించిన యువతితో విక్రమ్‌కు పరిచయమైంది. స్టేషన్లో దిగగానే ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.
'మీకు సిగరెట్‌ అలవాటుందా?' తాను కాల్చబోతూ అడిగాడు విక్రమ్‌.
'యాక్‌' వికారంగా అందామె.
'అంత తీసేస్తారేం? మీకేం తెలుసు దీని రుచి?'
'నన్నెవరైనా బలవంతంగా ముద్దుపెట్టుకున్నా సహిస్తానుగానీ సిగరెట్‌ వాసన మాత్రం భరించలేను'
'ఆ అవకాశం ఉందని నాకు తెలీదే' సిగరెట్‌ కింద పడేస్తూ అన్నాడు విక్రమ్‌.

చెక్ బుక్!

టీచర్: సర్దార్! నీ జీవితంలో నీకు ఏ బుక్ ఎక్కువగా ఉపయోగపడింది?

సర్దార్: మా నాన్న గారి చెక్ బుక్ సార్.

ఎంత భక్తి!

'వోయ్‌ మీరంతా ఈ మధ్య గుడిదగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?' ప్రశ్నించాడు లెక్చరర్‌.''అవును సార్‌. 'శ్రద్ధ'గా గుడికెళ్తే 'శాంతి' దొరుకుతుంది. మంచి 'భావన'తో 'పూజ', 'ఆరతి', 'అర్చన', 'ఆరాధన' చేయించి దేవుడి ముందు 'జ్యోతి' వెలిగిస్తే 'తృప్తి', 'ముక్తి' లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతాయంటే ఎందుకు వెళ్లం సార్‌?' జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.

ఏం చేసుకుంటాడు?

ఇంటి పెంపుడుపిల్లి ఆ రోజు చనిపోయింది. తన కొడుకు కిట్టూకు అదంటే ప్రాణం. అందుకని ఈ విషయం ఎలా చెప్పాలా అని మథనపడసాగింది మాధవి.సాయంత్రం స్కూలు నుంచి రాగానే, 'జానీ ఎక్కడమ్మా?' అడిగాడు కిట్టూ.'అది మధ్యాహ్నం దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది నాన్నా' బాధగా చెప్పింది మాధవి.'చచ్చిపోయిన పిల్లిని దేవుడు ఏం చేసుకుంటాడమ్మా?' ఎదురు ప్రశ్నించాడు కిట్టూ.

Wednesday, June 6, 2007

ఆడ గడియారం

ఆ రోజు సుధాకర్ భార్యకు డెలివరీ డేటు. కొడుకే పుడతాడని గట్టి నమ్మకంతో ఉన్నాడు సుధాకర్. ఆఫీసులో ఉన్నాడే కానీ ఎప్పుడెప్పుడు తీపి కబురు వింటానా అని తొందరపడుతున్నాడు. అయినా వీలైనంత స్థిమితంగా ఉన్నాడు.
సహచరులకు ఈ శుభవార్త తెలిస్తే పార్టీ ఇమ్మంటారని భయం. అందుకే బావమరిదికి ముందే ఓ కోడ్ చెప్పి ఉంచాడు. తను 'గడియారం వచ్చిందా?' అని అడుగుతాడు. పిల్లవాడు పుడితే 'వచ్చింది' అనాలి.
అప్పటికి సుధాకర్ రెండు మూడు సార్లు ఫోన్ చేయడమూ ఇంకా రాలేదని జవాబు చెప్పడం జరిగిపోయింది.
మరో అరగంట పోయాక ఫోన్ చేసి, 'గడియారం వచ్చిందా?' మళ్లీ అడిగాడు సుధాకర్.
అక్కడ బావమరిది సందేహంలో పడ్డాడు. పుట్టింది బాబు కాదు పాప. రాలేదంటే ఇంకా ప్రసవం కాలేదనుకుంటాడు. అందుకని ఇలా జవాబిచ్చాడు.
'గడియారం వచ్చింది, కానీ ముల్లు లేదు.'