Sunday, June 10, 2007

అది పాతది

'ఈడ్రాయర్‌ ఎంత?' అడిగాడు చంద్రకాంత్‌.

ధర చెప్పాడు సేల్స్‌బాయ్‌.

'వేసుకుని చూడొచ్చా?'

'డ్రాయర్‌ను కూడా ఏం వేసుకుంటారండీ బాబూ, సరే చూడండి' గొణుగుతూనే ఒప్పుకున్నాడు బాయ్‌.

వేసుకుని చూసి, వచ్చి, 'సరిగ్గా సరిపోయింది' చెప్పాడు చంద్రకాంత్‌.

దాన్ని ప్యాక్‌ చేయబోయాడు సేల్స్‌బాయ్‌.

'అదొద్దు, అది వాడింది కదా... వేరేదివ్వండి'.

అమ్మానాన్నా ఆట


బాబీ: ఈరోజు ఏం ఆట ఆడుకుందాం.

హనీ: అమ్మానాన్నా ఆట.

చిన్నూ: మరి నేనో?

హనీ: నువ్వు మా అబ్బాయివి.

బాబీ: ఆ ఆట నాకు రాదుగా.

బుజ్జి: నేను చెబుతాలే, నువ్వు పేపర్లూ పుస్తకాలూ నాపైకి విసురు. నేను గ్లాసులూ గిన్నెలూ నీమీదికి విసురుతాను. కాసేపయ్యాక నువ్వు తలుపు ధడేల్‌మని లాగి బజారుకు వెళ్ళిపో. నేనేవో ఈ చిన్నూగాడి వీపు పగలగొడతాను. ...అంతే.

అయితే పద


'నాన్నా... సర్కస్‌కు వెళ్దాం' అడిగాడు దీపు.
'ఏముంటుందిరా అందులో' పెదవివిరిచాడు తండ్రి.
'ఏనుగులున్నాయట నాన్నా'
'ఏనుగుల్నేం చూస్తాంరా'
'ఏనుగులు ఫుట్‌బాల్‌ ఆడతాయట'
'అందులో చూడ్డానికేముందిరా'
'షార్ట్స్‌ వేసుకున్న అమ్మాయిలు ఆ ఏనుగులను ఆడిస్తారట'
'సర్లే వెళ్దాం పద, ఏనుగులను చూడక చాలా ఏళ్లయింది'.

అందుకూ...


రాధ: నువ్వు కొత్తచీర కొనమంటే మీ ఆయన ఎగిరి గంతేస్తాడా, ఆశ్చర్యంగా ఉందే. ఎందుకలా?

రజని: కొత్తచీర కట్టుకోగానే ఆయన కాళ్ళకు నమస్కరిస్తాను. ఆ సీనంటే ఆయనకు మహా ఇష్టంలే.

అక్కర్లేని అబద్ధం


ఓబిల్డింగులో మూడు టైమ్‌బాంబులను చాకచక్యంగా పట్టుకున్నారు కానిస్టేబుళ్లు రాయప్ప, వెంగళప్ప.
జీపులో వాటిని స్టేషన్‌కు పట్టుకెళ్తున్నారు.
'అవునూ... మనం వెళ్తుండగానే ఓ బాంబు పేలిపోతే ఎట్లా?' భయంగా అడిగాడు రాయప్ప.

'దాందేముంది? రెండే దొరికాయని చెబుదాం' నవ్వుతూ బదులిచ్చాడు వెంగళప్ప.

'విల్‌' పవర్‌


ఏడుగురు కొడుకుల తండ్రి అరవై ఏళ్ల రాధాకృష్ణకు బ్రహ్మచెవుడు. ఈమధ్యే చికిత్స చేయించుకున్నాడు. కొన్ని వారాల తర్వాత ఆయనకు వైద్యం చేసిన డాక్టర్‌ తారసపడ్డాడు.
'మీకు ఇప్పుడు బాగా వినపడుతోందా?' పలకరించాడు వైద్యుడు.
'బ్రహ్మాండంగా' బదులిచ్చాడు రాధాకృష్ణ.
'మీ ఇంట్లోవాళ్లు చాలా సంతోషించాలే'
'వాళ్లకు ఈ చికిత్స సంగతి తెలియదు'
'ఏం? ఎందుకని చెప్పలేదు?'
'నా గురించి ఏమనుకుంటున్నారో వినాలని...'
'ఏమంటున్నారు మరి...'
'నువ్వే అర్థంచేసుకో. ఇప్పటికి ఐదుసార్లు నా వీలునామాను మార్చాను'.

రోజూనా?


నానిని కొత్తగా బడిలో వేస్తోంది శారద. వెళ్లనని మారాం చేస్తుంటే,
'అక్కడ నీకు కొత్త కొత్త విషయాలు చెబుతారు, చాలామంది స్నేహితులు అవుతారు...' అంటూ ఊరించి చెప్పి పంపేసింది.
రెండో రోజు ఉదయం కొడుకును తట్టి నిద్రలేపుతోంది శారద.
'ఊఁ...' అంటూ మూలిగి పక్కకు తిరిగి పడుకున్నాడు నాని.
'ఏంటీ బడికి వెళ్లవా?' అడిగింది తల్లి.
'ఈ రోజు కూడానా?' ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు నాని.